Monday, April 20, 2009

ఆంగ్ల పదములు, ఆంధ్ర భాషలో మార్పులు


         భాష ప్రధమ దశలో మానవుల కనీస అవసరాలను తీర్చే "పదావళి" పునాదిగా ఏర్పడినది. విజ్ఞానము పరిధి విస్తరించే కొలదీ భాష, మాటల కూర్పులు, వాక్య విన్యాసాల విస్తృతిలో "త్రి విక్రమావతారము"ను దల్చాయి. 

         భావ వ్యక్తీకరణా సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ఎంతో ఎత్తుకు ఎదిగిన భాషలు, ఆయా సమాజములకు వారి నాగరికతా స్థాయిలకు ప్రతి బింబాలుగా నిలుస్తున్నాయి ఆ యా జాతుల, వర్గముల ప్రజానీకమునకు. "ఇది మా భాష!" అని ఎలుగెత్తి చాటే టంతగా గర్వ కారణములుగా నిలుస్తున్నాయి. సరి క్రొత్త పదాలను అన్య భాషల నుండి భావముల స్పష్టీకరణకు తోడ్పడ గలిగే నుడువులను, స్వభాషకు అనువుగా రంగరించు కొన గలిగే భాషలు, పరిణామ క్రమములో ఉన్నత ప్రమాణములను ప్రవృధ్ధ మాన మొనరించుకోగలుగుతాయి. 

         తెలుగు భాష ప్రాచీనత కలిగిన అత్యద్భుత భాష. తెలుగు, కన్నడ, ఒరియా, మరాఠీ, తమిళ పదాలను ద్రావిడ భాషా వర్గములు, ఓండొరులు, ఆదాన ప్రదానములతో ప్రభావితములై ఉన్నవి. సంస్కృత భాషను పుణికి పుచ్చుకున్నది ఆంధ్ర భాష. తెలుగుభాష సాహిత్యములో జగజ్జేగీయమానముగా వెలుగొందినది. 

         1800 సంవత్సరము నుండి పాలకులైన బ్రిటీషు వారి ప్రబావము భారతీయ భాషలపైన ప్రసరించసాగినది. ప్రస్తుతము మన ఆంధ్రములో ఆంగ్ల భాషా పదములు "విలీనమైన రీతి" ని పరిశీలించుదాము. "తెనుగు" మౌలిక స్వరూపము అజంత భాష. అందు వలన ఉఛ్ఛారణలో స్పష్టత ఎక్కువ. పాశ్చాత్య భాషలలో కొన్ని స్థానములలో ఉన్నప్పుడు, కొన్ని అక్షరములకు, అంతర్ శ్రవ్యములుగా ఉండి, "విస్పష్టముగా పలుక బడవు". 

         ఉదాహరణకు : 1) కుక్కర్, గవర్నర్, 2) పేపర్, కంప్యూటర్. పాశ్చాత్య భాషల్లో స్పెల్లింగ్,ప్రొనౌన్సు చేయుట అనేక పర్యాయములు. కొన్ని సందర్భములలో పరస్పర వైరుధ్యములు తటస్థ పడుచునే ఉండును.( ప్రాక్ దేశములలో,మన హిందూ దేశములో,"లిపి"స్వరూపములు ఉచ్చ స్థాయిని అందుకొన్నవి,అందుకు కారణమైన మన పూర్వీకులకు మనము ఎంతో ఋణ పడి ఉన్నాము.) 

         "భాష ధ్వని సంకేతములు కలిగిన నాద స్వరూపిణి". సంస్కృతము ప్రభావముచే, 19 ధ్వనులు చేరి,జాను తెనుగులో 37 అక్షరములు కలవు,వెరసి,37 లిపి స్వరూపములు ఏర్పడినవి. తరువాత ఉర్దు,ఇంగ్లీష్ ల వలన విభిన్న ధ్వనులు తెనుగున చేరినవి. ఉదా: కాఫీ,ఫ్రెష్ గా ఉండుట, ఫ్రీ, ఫర్వా లేదు, పార్టీ ఫిరాయించుట, ఫోజులు కొట్టుట, ఫన్నీ, ఫ్యామిలీ. వీనిలోని "ఎఫ్" ధ్వని మనకు లేదు. ఈ ధ్వనిని సూచించే లిపి రూపము లేదు. అంతే కాదు! ఈ "ఎఫ్" ప్రభావముచే తెనుగు లో పదౌఛ్ఛారణ విచిత్రముగా, ప్రభావితము ఐనది. ఉదా: ఫక్కున నవ్వి, ఫలము. 

         రెండు శతాబ్దముల పాటు పాలించుటచే ఇంగ్లీషు వారి వర్డ్సు ఇబ్బడి ముబ్బడిగా భారతీయ భాషలలోనికి "వలసలు" గా వచ్చి చేరినవి.(నేడు ప్రపంచములో అనేక భాషల ఉనికియే ప్రశ్నార్ధకము అగుట మేధావులను కలవర పెట్టే అంశము ఐనది.) 

         అచ్చ తెనుగు లోన ఆంగ్ల పదములు ఇమిడి పోయిన పధ్ధతిని గమనించెదము: 

  1. "క" వెనుక ఉన్న "ట" ద్విత్వము ఐనది. ఉదా: లాకెట్టు, క్రికెట్టు, బ్లాంకెట్టు. 

  2. ద్విత్వములైనట్టి పదాంత ధ్వనులు అనేకములు. ఉదా: లక్కీ, లిమరిక్కు. 

  3. ద్విరుక్తములైన సరళములు. ఉదా: మగ్గు, జగ్గు. 

  4. "ఉకారము" మాత్రమే పొందిన సంకేతములు, దీర్ఘముల తర్వాతివి. ఉదా: కారు, గేరు, టీచరు ("ర" కారాంత ఇంగ్లీషు మాటలు) 

  5. కొసన ఉన్న ద్విత్వములు, సంయుక్తములు. ఉదా: ఫ్లాస్కు, డస్కు, మాస్కు, రిస్కు (ఇలాగ "స్క" ధ్వని కేవల ఉత్వమును పొందినది.) 

         ఈ విధముగా జాను తెనుగున ఆంగ్లము లీనమైన వైనములను మరల విపులముగా చర్చించుదము...
'''''''''''''''''''

2 comments: