Thursday, April 23, 2009

బహు ముఖ ప్రజ్ఞా శాలి - వరాహ మిహిరుడుక్రీ. శ. 499 నాటి వాడైన "వరాహ మిహిరు" ని అద్భుత దార్శనిక, ఖగోళ పరిశోధనలు మన భారత దేశమునకే గర్వకారణము. వరాహ మిహిరుడు ఉజ్జయినీ సమీపములోని "కాంపిల్య పట్టణము" లో జన్మించాడు. ఈతని తండ్రి పేరు "ఆదిత్య దాసుడు".

వరాహ మిహిరునికి ఆదిత్య దాసు బాల్యమునుండే జ్యోతిష్యములో జిజ్ఞాసను కలిగించాడు.
"లఘు జాతకము, బృహజ్జాతకము, బృహత్ సంహిత, వివాహ పటలము, యోగ యాత్ర, పంచ సిద్ధాంతిక"అనే అయిదు మహా గ్రంధాలను రచించాడు వరాహ మిహిరుడు. వీనిలో "వివాహ పటలము, యోగ యాత్ర"లు దొరకలేదు. అవి నేడు అనుపలబ్ధ్యములు!

"ప్రాచీనులు రచించిన గ్రంధములను నేను ఆమూలాగ్రమూ పఠించాను. ఆ విజ్ఞానముతోనే, నేను ఈ గ్రంధములను వెలయించాను" అని వినమ్రముగా చెప్పాడు అతను.
"సారస్వత మహాముని, ప్రజా పతి మనువు వాక్కులను గ్రంథస్థం చేస్తున్నాన"ని వరాహ మిహిరుడు చెప్పాడు.

తన పూర్వీకుల అమూల్యమైన విజ్ఞాన సంపదలను, తన తర్వాతి తరాల వారికి అందించే బృహత్ బాధ్యతలను, తన భుజ స్కంధాల మీద మోసిన ధన్య మూర్తి వరాహ మిహిరుడు.

ఆతని గ్రంథస్త విశేషాల పట్టిక

1. పంచ సిద్ధాంతిక - కొన్ని రకాల సాధారణ యంత్రాలను గూర్చిన వివరణలు, భూగోళమునకు సంబంధించిన విశేషాలు.

ఇందు లోని 13 వ అధ్యాయము
"త్రైలోక్య స్థానము". "రెండు అయస్కాంతాల మధ్య లోహ శకలము వలె ఏ ఆధారమూ లేకుండానే తారా గణమూ అనే పంజరములో భూగోళము పరిభ్రమించు చున్నది" అని నిర్వచనము నిచ్చాడు. టెలిస్కోపు వంటి ఘనమైన శక్తివంత పరికరాలేమీ లేని ఆ రోజుల్లోనే, ఈ అత్యద్భుత ప్రాకృతిక విశేషాలను లోకానికి అందించిన మేధావి వరాహ మిహిరుడు.

2. బృహత్ సంహిత - ఒక్కో అధ్యాయము చొప్పున 105 విషయాలకు విపులీకరణ.

అనేక ప్రపంచ భాషలలోనికి అనువాదము చేయ బడిన ఉద్గ్రంధము ఇది. ఈ సంహిత లో
  • సృష్టి ,తారా ,గ్రహ చలనాలు, ఋతువులు, ఉల్కా,హరి విల్లు వంటివి ప్రభవించుటకు గల హేతువులు, సూర్య, చంద్ర , గ్రహచలనాల వలన, వాని సంచారాల వలన, భూమిపైన ప్రాణులకు కలిగే సత్ప్రభావాలు, దుష్ప్రభావాలు.

  • వాస్తు ప్రకరణము -ఇళ్ళను ఎలాంటీ స్థలములలో కట్టుకో వచ్చును? ఎలాంటి కలపను వాడాలి లాంటి నేటి సైన్సులో నిరూపితమైన అంశాలతో ఆ నాడే మన దోసిట్లో పెట్టాడు అతను.
3. బృహజాతకము - ఇది అందరినీ ఆకర్షించే గ్రంధము.

మానవుని పూర్వ జన్మలు, అనేక జన్మ విశేషాలను పొందు పరిచాడు. సంజ్ఞలు(ప్రతీకలు), గుర్తులతో నిర్మిచిన శాస్త్ర గ్రంధ రాజము ఇది. మనుష్యులు ఎక్కడ, ఎలాగ జన్మిస్తారు? వారి ఆకారాలు,
స్వరూప, స్వభావాలు నిర్ణీత పద్ధతిలో నిర్మించ బడుతాయని , నిరూపిస్తున్న సిద్ధాంత పరంపరలు ఈ పుస్తకము ఆతని అసామాన్య ప్రతిభకు నిదర్శనము.

4. లఘు జాతకము:

పై
"బృహత్ జాతకమునకు" సంక్షిప్తీకరణముగా విరచించ బడిన పొత్తము ఇది. "బృహత్ జాతకము" ను మేధావులు మాత్రమే అర్ధము చేసుకొన గలరు. అదీ గాక ఇది గ్రంధ విస్తృతీలో చాలా పెద్దది. అందు చేతనే, సాధారణ ప్రజలకు సులభ గ్రాహ్యముగా, అందు బాటులో ఉంచే ప్రయత్నమే ఈ "లఘు జాతకము" . ఈ క్లుప్తీకరణ, విద్యార్ధులకు "ప్రాధమిక అవగాహనాను కలిగించగల అనుబంధ గ్రంధము"అని పేర్కొన వచ్చును.

మహా మేధావి వరాహ మిహిరుని గురించిన మరిన్ని విశేషాలను మళ్ళి తెలుసుకుందాము.


వరాహ మిహిరుడు - భౌగోళిక పరిశీలనక్రీ. శ. 499 వ సంవత్సరము నాటికే, భూమి అంతర్గత పొరలను గూర్చి వివరించిన మేధావి వరాహ మిహిరుడు. భూమి లోపల ఏ యే లోహాలు, ఎక్కడెక్కడ దొరుకుతాయో, గుర్తు పట్టడానికి వెలువరించిన అనేక కొండ గుర్తులు ఆచరణ యోగ్యమైనవే!

కొన్ని ఉదాహరణలను పరికించుదాము.....

కాటుక పిట్ట వలన ఆనవాళ్ళు:
1) కాటుక పిట్ట సంగమించిన చోట "నిధి" దొరుకుతుంది.

2) కాటుక పిట్ట త్రొక్కిన చోట "అభ్రకము" దొరుకుతుంది.

3) కాటుక పిట్ట మలవిసర్జన చేసిన చోట "బొగ్గులు" లభిస్తాయి.
ఇలాగే భూమి లోపలి పొరలలో నీరు, మంచి నీళ్ళు ఎంతెంత లోతులో ఉంటాయో కనుగొనేందుకు ఆతడు గైకొన్న ఆధారాలను గమనిస్తే సంభ్రమాశ్చర్యాలకు లోను ఔతారు.

అధికముగా మొక్కలు, పొదలూ మొలిచిన చోట్లు; చెట్లు, చేమలు ఉన్నచోట్లు ఆతని గవేషణకు మూలాధారాలు ఐనాయి. (నేడు వనాలు, చెట్లు ఛిన్నాభిన్నమౌతున్నాయి. అత్యాశా పరుల చేతుల్లో ప్రకృతి మాతకు రక్షణ ఏదీ? ఆనాడు వరాహ మిహిరుడు సూచించిన తరు, పశు, పక్ష్యాదులను వీక్షించాలంటే, భూతద్దమును పట్టుకుని బయలు దేరాల్సిందే కదా!)

తీయని మంచి నీళ్ళు దొరికే ప్రదేశాలను గుర్తించేందుకు ఉదాహృతమైన వరాహ మిహిరుని పరిశోధనలు కొన్ని:
1) నీలి మందు చెట్టు దగ్గర పాము పుట్ట గనుక ఉన్నచో, ఆ పుట్టకు దక్షిణ దిక్కు వైపుగా 'రెండున్నరగజాల' దూరములో, 'ఎనిమిదిన్నర గజాల' లోతున త్రాగడానికి యోగ్యమైన మంచి నీళ్ళు లభిస్తాయి.
2)“జంబూ వృక్షస్య ప్రాక్ వల్మీకో యది భవేత్ సమీపస్థఃత్ ,
అస్మాత్ దక్షిణ పార్శ్వే సలిలం పురుష్వయే సాధు”
అనగా - నిర్జల ప్రదేశంలో ఉన్న నేరేడు చెట్టుకు
తూర్పు దిక్కులో పుట్ట ఉండి ఉంటే,
దానికి దగ్గర్లో దక్షిణ దిశలో
2 పురుష ప్రమాణముల( 10 అడుగులు) లోతునందు తవ్వితే
అక్కడ అతి తీయని(sweet) జలనాడి ఉంటుంది -
అని నమ్మకంగా నుడివాడు వరాహమిహిరుడు.
వరాహమిహిరుడు ఎఱుక పరిచిన ఖగోళ దృశ్య విశేషాలలో కొన్ని:
1) సప్తర్షి మండలానికి, చక్ర భ్రమణము కలదు.

2)సూర్య గోళములో 33 మచ్చలు ఉన్నాయి. అవి రాహువు, కేతువు, తామస అగ్ని కీలలు.
అలనాడు వరాహ మిహిరుడు తెలిపిన భవిష్యత్ వాణిని తిలకించండి.
1) వాయు ప్రకోపితాల వలన సౌరాష్ట్ర, మగధ దేశాలలో భూకంపాలు సంభవిస్తాయి.

2) గురువు, శని గ్రహాలు రెండూ ఒకే నక్షత్ర దిశా స్థానములో వెలుస్తున్నాయి, అందు చేత క్రీ. శ. 1970 లలో (అనగా అక్టోబరు, నవంబరు లలో) పుర ప్రభేదములలో అంతర్యుద్ధాలు సంభవిస్తాయి.
ఉగాది ఎప్పుడు?

భారతీయులందరూ ఆప్యాయతతో చేసుకునే పండుగ "ఉగాది" .
కొత్త సంవత్సరమును ఉగాది పండుగగా ఆహ్వానిస్తున్నాము.
మరి ఈ ఉగాది నీ ఏ సమయములో నిర్ధారణ చేయాలి?
"బ్రహ్మాది యుగాది కృత్"
"బ్రహ్మ యుగావర్తః "
అనగా అది "వసంత విషువత్ కాలము"
ఈ నిర్ణయములో ఎంతో అనుకూలత,
భౌగోళిక పరిశీలనచే నెలకొల్పినదగుటచే,
ఎంతో సామంజస్యము కలిగి ఉన్నది.

ఈ రీతిగా వసంత కాలమును, ఉగాది
అని వరాహ మిహిరుడు నిర్దేశించిన స్వచ్ఛమైన నిశ్చయమైన నిర్ణయ,
ప్రజలచే ఆమోదించబడి,ఆచరించ బడుచున్నది కదా!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

No comments:

Post a Comment