పడతీ!
నీ పెదవులపై దరహాసము,
శరత్ చంద్రికలకు మెరుగులు దిద్దింది.
నిదురలో చెదరిన నీ ముంగురులను సరి దిద్దిన
చిరు గాలికి 'పూ పుప్పొడి ' పరిమళాన్ని అద్దింది.
'సుగంధాన్ని ,మలయ పవనానికి ప్రసాదముగా
ఒసగినట్టి 'పుష్ప రజములకు
వన దేవత ప్రశంసలు,మిక్కుటముగా లభించినవి.
తరుణి హాస స్పర్శ మహిమ నిరూపితము అవుతూనే ఉంది,
సదా
*** *** ***
నీ అధరాలలోన దర హాసం పులకరించింది
నీ కనుకొలకుల 'అలుక ' కులుకుగ తా పవ్వళించిందోహో!.
కినుకకు మెలకువ వస్తే,అది నాకు 'కానుక
రాకుంటే,,,
అది,ఈ కవితా అసిధారా వ్రతమ్మునకు
అమూల్యమౌ బహుమతి.
*** *** ***
ద్రాక్ష గుత్తిని పట్టి,పండు నొకటొకటే
కొసరుగా తింటూన్నది ,
దరహాస లావణ్యములు విరియుచూ చెలియ.
నల్లని రేయిలో,తెల్లని జాబిల్లి,అటు వేపున,
సుదతీ!
నీ 'తెలి నగవు నింగి ' పైన
నీలి ద్రాక్ష ఫలముల జాబిల్లులు,ఇచ్చట,
ఉపమాలంకరమ్ముల వ్యత్యస్తము కూడ
కోండొకచో శోభిల్లును, చిత్రమే!
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''