Tuesday, April 21, 2009

పట్టుదల
















       
         అబ్బులు చాలా అమాయకుడు. అతని అమాయకత్వము తెలిసి, అందరూ మోసగిస్తూ ఉండే వాళ్ళు.
 ఆ ఊళ్ళో 'కరటకుడనే' వాడు ఉండేవాడు.
వాడిదగ్గర ఒక గుర్రము ఉన్నది. అది చాలా మొండిది కావడంతో, కరటకుడికి చాలా విసుగు పుట్టింది. అబ్బులు అమాయకత్వంగూర్చి విని,
ఆ మొండి గుర్రాన్ని అబ్బులుకు అంట కట్టాలనుకున్నాడు.
వెంటనే అబ్బులు దగ్గరికి వెళ్ళాడు కరటకుడు. 

         "అబ్బులూ! నా గుర్రం చాలా మంచిది. ఈ గుర్రం మంచి రాశి గలది.
 దీన్ని కొన్న వాడు బాగా ధన వంతుడు ఔతాడు." అని చెప్పాడు కరటకుడు. 

         అతని మాటలను నమ్మి, అబ్బులు ఆ అశ్వాన్ని కొన్నాడు.
 పాపం! అబ్బులు దాన్ని ఎక్క బోతే అది ముందు కాళ్ళతో తన్నింది.
ఈ చోద్యాన్ని చూస్తున్న 'కరోడుడు ' అనే వాడు
"అబ్బులూ! నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది.
 అది చాలా మొండి గుర్రం. నువ్వు చాలా తంటాలు పడాల్సి వస్తుంది కదా!"
అని, అంతటితో ఊరుకోక,
"ఇదిగో! నా దగ్గర ఉన్న గుర్రాన్ని చూడు! చాలా కొత్తది.
 ఇది నిన్ను ముందరి కాళ్ళతో తన్నదు. కావాలంటే పరీక్షించు" అన్నాడు.
 అంటూనే దానిపైన అబ్బులును కూర్చో బెట్టాడు.
అది ఏమీ చేయక పోవడంతో ఆతని మాటలను నమ్మి డబ్బులు ఇచ్చి కొన్నాడు.

ఇంతకీ కరోడుడు అమ్మింది గుర్రాన్ని కాదు..... 'గాడిద 'ను.

         అలా గుర్రం అనుకుని గాడిదను తన ఇంటికి తెచ్చు కున్నాడు అబ్బులు.
తీరా ఎక్కబోతే అది వెనక కాళ్ళతో తన్నింది. అది గాడిద కదా మరి!
ఈ తతంగాన్ని అంతా కని పెట్టిన వేరొక మోసగాడు
"నా దగ్గర ఉన్న గుర్రాన్ని చూడు! ఇది ముందు కాళ్ళతో తన్నదు, వెనక కాళ్ళతో తన్నదు"
అంటూ నమ్మించి, రొక్కమును(డబ్బు)పుచ్చుకుని ఉడాయించాడు.
ఓ కొయ్య గుర్రాన్ని అంట గట్టాడు అబ్బులుకు. 
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


         అబ్బులు మోస పోయిన వైనాన్ని చూసి అందరూ గేలి చేసారు,
 చిలవలు పలవలుగా చెప్పుకున్నారు.
అది భరించ లేక అబ్బులు కొయ్య గుర్రాన్ని తీసుకుని అడవిలోనికి వెళ్ళాడు.
అక్కడ ఓ ఊడల మర్రి చెట్టు కింద కూర్చుని ఏడ్వ సగాడు. 
ఆ చెట్టు మీద ఉంటున్న దేవత,
 అతని పైన జాలి పడి, కొయ్య గుర్రానికి ప్రాణము పోసింది.
 ప్రాణము వచ్చిన ఆ గుర్రము అబ్బులుకు చదువు నేర్పింది.
కాల క్రమేణా అరణ్యములోని జంతువులు,పక్షులు అతని నేస్తాలు అయ్యాయి.
 చెట్లను ఎక్కడాన్నీ, స్వారీ చేయడమూ వగైరా విద్యలను నేర్ప సాగాయి.
 కానీ.... అబ్బులుకు ఏ విద్యలూ సరిగా అబ్బలేదు. 

         "పంచ కళ్యాణి" అని అబ్బులు తన గుర్రానికి ముద్దుగా పేరు పెట్టుకున్నాడు.
 పంచ కళ్యాణి" తన యజమాని స్వారీ ఎందుకు నేర్చుకోలేక పోతున్నాడో "అని ఆలోచించింది.
 అతనిలో దాగి ఉన్న పిరికి తనమే కారణమనీ పసి కట్టింది.
ఒక రోజు అబ్బులుకు సవ్వారీ నేర్పుతూ,
 అతణ్ణి కావాలనీవాగులో పడెసింది.
 నీళ్ళలో పడిన అబ్బులు
"కళ్యాణీ! కళ్యాణీ! కాపాడు!" అంటూ గావు కేకలు పెట్టాడు.
 కానీ లాభము లేక పోయింది.
నీటిలో గిర గిరా, గింగిర్లు తిరుగుతూ భయంతో బెంబేలెత్తుతూ 
ఎలాగైతేనేం, అలాగే ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. 

       
  "ఈత కొట్టడము తెలీని తాను
తీరానికి అలాగే ఈదుకుంటూ చేరాడము ఆశ్చర్యంగా ఉన్నదే!!!"
 అనుకున్నాడు అబ్బులు. 

"చూశావా అబ్బులూ? జల క్రీడలు కూడా తెలీని నువ్వు,
 చిటికెలో ఈత నేర్చుకుని, ఒడ్డుకు చేరావు. 
పట్టుదల, ఏకాగ్రత ఉంటే ఏ విద్య ఐనా నేర్చుకోవచ్చును"
 అనిన పంచ కళ్యాణి మాటలు, అబ్బులు పైన బాగా పని చేసాయి,
 ఆత్మ స్థైర్యాన్ని నింపినవి. 

         అది మొదలు అన్ని రకముల విద్యలనూ
 తిరిగి వెను చూసుకోకుండా నేర్చుకున్నాడు అబ్బులు. 
సంఘములో తిరుగు లేని కీర్తిని ఆర్జించాడు.



'''''''''

''''''''''''''''''''

No comments:

Post a Comment