Thursday, April 24, 2014

రామాయణ కుసుమము


मा निषाद प्रतिष्ठांत्वमगमः शाश्वतीः समाः। 

यत् क्रौंचमिथुनादेकं वधीः काममोहितम् ।।"మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః| 

యత్ క్రౌంచ మిధునా దేక మవధీః కామమోహితమ్||

అలనాడు ప్రభవించిన ఆ శ్లోక మహిమ ఏమొ 

"ఆది కావ్యము" నకు శ్రీకారము ఆయెనొహో! 

అంతరంగముల స్పర్శ , అనుభూతుల ప్రతి ధ్వనియె 
లయబద్ధమైనది చిత్రమ్ముగా - పద చిత్ర కావ్య స్వరూపమ్ముగా 
ఇతిహాసమీ రీతి నవతరించింది.
ప్రతి అక్షరమ్మునూ ధ్యాన - పావనమ్మైనది 
లోకులకు అపురూప నిధి దొరికెను
శ్రీమత్ రామాయణమ్మనెడు కావ్య రాజమ్ముగా
సంఘ నియమావళికి రాజ నీతికిని
భేదమేమీ లేని కొంగ్రొత్త రచనమ్ము 
విశ్వమ్మునందునే తొట్ట తొలిది ఇదే “శ్రీరామ”! 
శ్రీరామభద్రుడు నడచి ఏర్పరిచెను 
ఈ బాట ప్రజలకు బహు భద్రమ్ము ఆయెను

శ్రీ రామభద్రుని చరితమ్ము ఇటు నిటుల
శుభముగా నగుటయే"ఆహ్లాదమాల" యగును
నేటి కిట్లు నేను సంపూర్ణ రామాయణము వ్రాయగలిగినాను
ధన్యమైనది నాదు జీవితము నేటికి
ఆదర్శ సంఘపు ఒరవడిని; పెట్టినది ఈ ఘంటము!
తాళపత్రములకు వందనమ్ములు చేసె ముని
కవిలెకట్టలను పీఠమ్ముపై నుంచి, అర్చించె!

******

ఘన శ్లోక సంపుటిగ అవతరించిన వారు ఎవ్వరయ్యా? 
అదె వచ్చుచుండెను - శాంతభావ రస ప్రతిరూపము 
ఆదికవి వాల్మీకి, పుంభావ సరస్వతి అతనే సుమీ!
పలుకు పలుకున మనసు పులకించగా
ప్రతి మనసు మానవత పలుకు బంగారమవగ
పులుకు పులుకున మమత పలవించగా
అని తలచుచూ వల్మీక జనితుడు
సరయూ నదీ తటిని తిరుగాడ వెడలెను
సంధ్యా వందనానుష్ఠానములను ఒనరించు విధి కొఱకు
తా బయలుదేరేను మును జన్మలో బోయ రత్నాకరుడతడు
సంస్కారము చేత దివ్య కవి ఋషియైన పుణ్య శీలుండు!

******

వచ్చెనదిగో తండ్రి, వాల్మీకి మునిరాజు!
శిష్య భరద్వాజ, వన వాసులు కాంచిరి అడవిలో 
మూర్ఛిలిన అపరంజి బొమ్మంటి నారీ శిరోమణిని! 
బిరబిరా గురుదేవు వద్దకు వెడలినారు 
"పుణ్య తమసా తటిని; ఒక తటిల్లత కాంతి
శోషిల్లిన జ్యోతి, అది ఎవ్వరో" అనుచు,

శిష్య గణములు తెలుప, ఆదికవి విచ్చేసె; 
దరి చేరి, కాంచిరి అటనున్న అతివను

నిడుపాటి గడ్డమును మంద వాయువు నిముర 
మందహాసము మెఱయ అరుదెంచె నచటకు; 
ముప్పిరి గొన్నట్టి విస్మయము తోడ 
తన దివ్య దృష్టి తోడ వాల్మీకి కనుగొనెను

"మూర్ఛిల్లిన వనిత వేరెవ్వరో కాదు 
శ్రీరామచంద్రుల సహధర్మచారిణి!
జగదైక పా,వని జగద్ధాత్రి, 
సీతమ్మ మా అమ్మ! అయ్యయో!!"
నట్టడవిలోన ఆ అయోధ్యా రాణి 
స్పృహ తప్పి పోయిన కారణము బోధ పడి 
సకల నేపధ్యమ్ము బోధపడ మునివరుడు డిల్ల వడె! 
"భూపుత్రి సీతమ్మ అతి కోమలాంగి; నిండు చూలాలు
నది తమస కెరటాల శీతల పవనాలు 
సీత కన్నీటికి నిలువెత్తు సాక్ష్యాలు;

విమల రామాయణ కర్త ,వీక్షణములు కూడ 
విస్తృత చకిత విస్ఫారితమ్ములాయె. 
అమల పున్నెముల ప్రోగు, సౌశీల్య రాశి 
అబల జానకీ మాతయే ఈమె;

ఎంత తరచిన గాని విధి లీల ఇంతేను, 
ఎవరి వశమున లేని తుంటరిది విధి - అనుట నిర్ద్వందము,
కాలపురుషుని నిత్య నిర్వచనమది కదా! "

******
శాంతికి నిలయము తాపసి ఆశ్రమము,
లోక పావని! అమ్మ! కొలువైన తరుణమున 
శ్రీ లక్ష్మీ ధామము ఆయెనమ్మా! నిజము! 
వనితామణిని సేదదీర్చిరి గిరి జనులు, 
ఆశ్రమ వాసినులు, పూజ్యులు వాల్మీకి, ఎల్లరు 
సానునయ వచనముల, సముదాయించినారెంతగనో
ఆదరమ్ముగ అక్కున చేర్చుకుని అనునయించారు

******
"మా ఆశ్రమమ్మిది! మహిళా మణీ! 
మనో వ్యధలను, శ్రమలను బాపు మహత్తులు గల 
మహిలోని మహనీయ స్థలమిది తెలియగా!!

చింతలూ, వంతలూ నిండుచూలాల! 
కలలలోనైనా నీ దరికి రాబోవు, 
నిండు నవ్వుల పున్నమల వెన్నియల్లు
నీ కెంపు అధరముల వ్రాలవలె సొంపుగా పరచుకొను!!

చింతకాయలు నీకు కోరినన్ని, 
పుల్ల మామిళ్ళు కావలసినన్నీ
నోటి మాట నోట ఉండగానే - 
ప్రతి తరువు, ప్రతి కొమ్మ నీ మోవికందించు!
లతలు పలుకరించు, లలనామణీ! 
నిశ్చింత భావాల తూగాడుతూ నాతిరో! 
ఉయ్యాలలందురుకు బిడ్డలను ఈవమ్మ!

******
ప్రకృతికి కూడా సీతపై కడు జాలి ;
ణతి సీతమ్మను - ప్రకృతిలో ప్రతి అణువు 
కను రెప్ప వోలె ;కాపాడు చుండేను!

వన కన్యకల ప్రేమ, 
వనదేవతల - మమత అనురాగ మంజరులు
పరిమళమ్ముల నిండె పరిసరములు; 

జనకజకు నిరతమ్ము గురుతు కొచ్చేను
గతమంత అనుక్షణము తలపులల్లికలై
నాగేటి పుట్టువు సీతమ్మ తల్లికి 
జ్ఞాపకముల నావ సాగుచూ ఉండేను 
కౌసల్య కోడలికి అవి సుంత ఓదార్పు!

ఎదురీత బతుకాయె అమ్మ సీతమ్మకు! 
ఎదురుచూపుల తెరవు, తెరచాపగా ఆమె 
తలపుల నెమరుల త్రుళ్ళింతలు
రవ్వంత జోడీలు రమణీ లలామకు ; 
“హరివిల్లు విరిచిన స్వామి కలువ చేయి - 
శివధనుర్భంగము చేసిన 
అలనాటి రాముల రూపము ;

నీలమోహను వంపు ఇంద్ర చాపమ్ము! 
ఎదురుకోలలలోన తన ఓరచూపు; 
మైధిలీ క్రీగంటి చూపులను పెనవేసి 
నవ్య హరివిల్లుగ - నీలాల గగనమున 
వెలసె, ప్రాణము వచ్చి! సభికులకు కను విందు!

సిగ్గుల తెర చాల దళసరిగ ఉన్నాది
ఇక పట్టనేల ఆ నడుమ తెరసెల్ల? 
ఓ చెలియలారా! మధ్య తెర దిగగానె
పూబోణిని స్వామీ తిలకించినాడు 
నాడు పద్మ దళ నేత్రుండు ఆ నాడు 
విరిసిన చిరునవ్వు విసిరినాడు 
కెంపు క్రీ పెదవిపై!
తనదు కొనగోట మీటెనో లేదో 
అంతటి శివ ధనువు 
అంతలింతలలోనే వింతగా విరిగింది 
జనక రా సభలోన దిగివచ్చినాదదిగొ     
శ్రీమంతమౌ ఏడు వన్నెల విల్లు!
సీతా స్వయంవరము భువనాల 
కందినట్టి అపురూప వారము సుమీ!

సిరి బాసికములోన రాముల రూపము 
చెంప దృష్టి చుక్క తన కంటిలోన 
నీలమోహనశ్యాము నవలాకు వన్నెలు
చిరునగవు వన్నియలు చిందిన తీరులు
చిటి చిలిపితనములు చిలికిన సౌరులు 
విరబూసె తనువున విరజాజి తావులే!

విరజిమ్మె మైమరుపు చిత్రాలు రచనలు 
కలికి కనుకొలకుల అనురాగ నళినములు 
తన తలపైన బెల్లము, జీల కర్రల మిశ్రమమ్ము 
భద్రముగ ఉంచిన రాము కరకమలమ్ము

"నీ మనసు పొరలలో శ్రీ రాఘవుండా! 
దాచుకుని ఉంచిన బొమ్మ నాదే కదా!?
నా వేలు పట్టిన ఆ చేయి నీదేను!
శిరసుపయి గుడ, జీర (= బెల్లము, జీలకర్ర) 
మిశ్రమమునుంచిన ఆ చేయి!
పసుపు తలంబ్రాలు హర్షధారలుగ 
జాలువారే రీతి;పోసినది ఆ చేయి!

ఆ చేయి, ఈ పగిది ఇపుడిటుల 
ఎటుల వీడేనయ్య! దాశరధీ, రామ! 
అరయనేరగలేను, అబలనైతిని నేను!
అలనాటి మురిపములు, దాంపత్య శోభల 
మణినూపురముల సుతిమెత్తని 
మధు సరస సందడులు శతకోటి అవి ఏవి? 
ఆ నాటి అచ్చటలు, అప్పటి ముచ్చటలు 
ఆ సంగతులు అన్ని నీటిజాడలు ఆయె, 
నిది ఏమి ఖర్మము? ఏ నాటి పాపమో ఈ గతిని 
పెనవైచి నను చుట్టుముట్టాయి

****** 
ప్రకృతికి కూడా సీతపై కడు జాలి - 
ప్రకృతిలో ప్రతి అణువు పణతి సీతమ్మను 
కనురెప్ప వోలె కాపాడుచుండేను! 
మొక్కలు, చెట్లన్ని పూతలు పూసినవి 
పూవులు పూచినవి కాయలు కాచినవి 
కాయలు మా మంచి పళ్ళుగా మారినవి!!

ఋతువుల దీక్షలు ఫలియించెనమ్మా! 
కాలపురుషుని కనులు కాయలు కాచినవి! 
కాలము "మహోద్గ్రంధ కావ్యముగ మార

లోక పావని పొందె ఇనుమారు వరములను; 
ఆ పర్ణ శాలలో జంట కేరింతల్లు; 
కవల పిల్లలు పుట్టినారనుచు సందడులు! 
మునివాటిక గొప్ప డోల ఆయెను సుమ్ము! 
అను సంబరమ్ములు వనలక్ష్మి దేవివి!

కారడవిలో మునులు, గురు శిష్య బాలకులు 
గిరిజనులు, భిల్లులు, కోయ ఆటవికులున్ను; 
పశు పక్షి గణములు, తరు ప్రాణి కోటియును; 
సీతా సుపుత్రుల అచ్చట్ల ముచ్చట్ల 
సృష్టి యావత్తునూ ఓలలాడింది, భళి! 
ప్రకృతి కడ ముదముగా - మారాము బాలురది!
మా 'రాము పుత్రుల 'ముద్దు ముచ్చటల కొఱకు;
గారాము కొసరేటి- ప్రకృతి కడు గడుసరిది! 
భళి! అస్త్ర శస్త్ర విద్యలన్నింటినీ 
ఆడుతూ పాడుతూ జోడుగా నేర్చిరి;
లాలిత్య గానములు వెన్నతో పెట్టిన నికషోపలములు!
వారి ననుక్షణము పరికించు గురు తాపసి;

"ముద్దులొలికేటి ఈ కవలలు
శ్రీరామ సీతలకు కనుగవలు సత్యము!
ఈ జంట లోకముల కన్నులపంటలు ;
ఇక సమయము వచ్చె; 
సుశ్లోక ఇతిహాస రామాయణమునకు; 
వీరివ్వగలరు ఇలకు 'మంచి ముక్తాయింపును'

లోకక్షేమము కోరు దీర్ఘదృష్టి మునిది
"నేటి దాకా ఈ పచ్చనటవీ సీమ, 
మీ గాన లహరిలో ఓలలాడినది! 
కుశ కుమారా! నీవు తమ్మునితొ కలిసి; 
అయోధ్యా నగరమ్ము మీద ఓ పిల్లలారా!
మీదు గానార్ణవపు నవ – తుషారమముములను 
చల్లంగ కురిపించి నవీన యుగ పర్వమవ్వండి.

మీ గాన వివరణా నైపుణ్యములనచట విశద పరచండి! 
పావనమ్మౌ గాథ రామాయణమ్ము 
సంగీత సరిగమల పరిమళమ్ములుగా; 
సాకేతపురమున ప్రజల ఎడదలలోన పరివ్యాప్తి చెందవలె

సకల జన భావనలు - మమతలకు ఇరవులగు; 
"శ్రీరామ-చుట్టబడు" శుభలగ్న వేళలు; 
మీ వలన సౌభాగ్య సన్నివేశములు 
ఇతిహాస హాసమై రూపొందుటన్నది;

ఈ సీమలకు లబ్ధి, పరమ పెన్నిధులు!
లవ కుమారా! మీ అన్నదమ్ములకు 
చల్లని మా శుభ ఆశీస్సులు!" 
సౌభాగ్య దీవెనలు తోడుగా ఉండె!

******

తోడుగా కొందరు జడధారులు రాగ; 
జత బాలురు జంటరాగమ్ములవోలె; 
అడుగులు ముందుకు వేయుచూ సాగిరి
"ఆదికవి వాల్మీకి రసరమ్య చిత్రణము - 
భావి జగతికి శ్రీకల్పవృక్షమ్ము!" ; 
అడుగడుగునా మధుర రాగముల 
చిలుకుతూ కుశలవ కథా బోధనా ప్రజ్ఞలకు;
మార్గమున ప్రజలెల్ల; మురిసి మైమరుచుచూ, 
జేజేలు పలికేరు ఆ బిడ్డలిద్దరికి!
శ్రోతల, ప్రేక్షకుల కన్నీటితోటి 
అయోధ్యా పురి నేల చిత్తడి ఐనది 
జలముల తడిసేటి ఈ దరి; 
గగన జాహ్నవిదా? సీతమ్మ లోచనమ్ముల 
ఇగురని కన్నీటి నిద్దంపు మడుగులో?

ఎల్ల మనుజాళి హృదయోదయ కిరణాలా? 
నవ నవోన్మేష అనురాగ రాగముల మాల ధారణలతో; 
నవ సమాజమునకు- నాంది- కలిగేను! 
కుశలవ కుమారులు నగరికీ చేరిరి;
జనశృతిని విన్నారు; రఘు వంశ వనితలు;
కౌసల్య, సుమిత్ర, కైకేయిలు, 
శ్రుతకీర్తి, మాండవి, ఊర్మిళాదులును 
అంతః పుర ప్రౌఢలు, స్త్రీ రత్నములు వారి చేరబిలిచారు
కొసరి కొసరీ అడిగి - గీతములు విన్నారు!
శ్రీరామచంద్రుడు, సోదరులు, తదితరులు 
ఆబాలగోపాలమా మాధురిని గ్రోలారు; 
తన చేతలు, గాధగా తానె వినవలసె నీ పగిది
రాముడు సంకటము లోబడుచు తడబాటు నొందాడు, 
"హా సీత! ప్రియ రాణి!" అనుచు విహ్వలుడాయె!

******
కైకేయి నిలువెల్ల కదిలిపోయేను
"నేను విధియిస్తిని పదునాలుగేండ్లు 
శ్రీరామునికి నాడు, పొరపాటు నాది! 
ఇపుడు ఓ దైవమా! మరల పదునాల్గేళ్ళాయె! 
ఓ విధీ! నా వలెనె నీవును నేరమ్ము చేసితివి; 
సత్వరమె పాపమును సరిదిద్దుకొమ్మా! 
కొమ్మ సీతాదేవి రాముని పత్ని, 
ఎట నున్నదో? ఏమొ? ఎరుకైన లేదు 
పుత్ర సహితమ్ముగా దేవి పునరాగనమ్ము 
మాదు రాజ్యమ్మునకు శుభదాయకము, 
ఈ వరము నొసగుమమ్మా విధీ మాకు !!" 
అనుచు విలపించేను భరత జనని కైక!

****** 
పావనమ్మౌ గాథ రామాయణమ్ము!
సంగీత సరిగమల పరిమళమ్ములుగా; 
ప్రజల ఎడదలలోన వ్యాపించవలెను 
సకల జన భావనలు మమతలకు ఇరవులగు
శ్రీరామ-చుట్టబడు" శుభలగ్న వేళలు; 
మీ వలన ఒనగూడు సౌభాగ్య సందర్భములు 
పావనమ్మౌ చరిత- గా రూపొందుటన్నది; 
ఈ సీమలకు లబ్ధి, పరమ పెన్నిధులు!" 
స్మిత వదన ఋష్యశృంగ సతి శాంతమ 
మెటికలు విరిచుచూ దిష్టి తీసినది

నగర మనుషుల జోతలను గైకొని, 
కుశలవులు మరలిరి కాననమ్మునకు! 
గురువులకు, మాతకు చెప్పారు 
అన్ని వివరమ్ములను ముచ్చటగ!
&&&&&&&&&&&&&&


******
కాంచన సీతను పక్కన నిలిపి, 
రాములు చేసిరి అశ్వమేధమ్ము 
మడమ తిప్పని ఆ తురగ వల్గనము 
రామ మార్గమునకు కొంగ్రొత్త మలుపు!

******
విస్మయపరచగా లవకుశుల వీర విన్యాసాలు 
తనయుల చేతుల్లొ తన ఓటమియే గెలుపు అవ 
జనకుని చేరారు బిడ్డలిరువురును; 
"నాదు కర్తవ్యము నేటితో ముగిసె" నని 
అవనిజ కనులార శ్రీరామ కూటమిని - 
కాంచుతూ చేరినది - తన అమ్మ ధరణి ఒడిలోనికి!

నిరతమ్ము కదిలేటి అలల సరయూ నది; 
రామాయణమునకు కట్టి ఉంచిన ముడుపు!
చంద్రికల మోసేటి భాగీరధీ అలలు
శ్రీమద్రామాయణాహ్లాద హేమంత పుటలు.

Tags:- కుశలవ, తమసా నది, వాల్మీకి; ,
            ఋష్య శృంగ, శాంత

(గీత రూపకము : చైత్ర కోణమానిని)
716 Posts 

******

1
రామాయణ కుసుమము  User Rating:  / 3
Member Categories  - కోవెల
Written by kusuma kumari
Thursday, 17 April 2014 08:55
Hits: 137

No comments:

Post a Comment