Sunday, May 18, 2014

నెహ్రూజీ, నీలం పుస్తకము


ఇండియా తొట్ట తొలి ప్రధాన మంత్రి. బాలలకు ఈయన “చాచా నెహ్రూ”. శాంతిపావురములను ఎగురవేసే  అలవాటు జవహర్ లాల్ నెహ్రూ ద్వారా వ్యాప్తి చెందింది. ఒక సాధారణ వ్యక్తికి జవహర్ లాల్ నెహ్రూ తటస్థపడినప్పుడు జరిగిన సంఘటన ఇది.

మహాన్ సింఘ్ బయస్ ఒక జూనియర్ పోలీసాఫీసర్. 1958 లలో అతను సెక్యూరిటీ డ్యూటీ చెయ్యాల్సివచ్చింది. బోంబే (నేటి ముంబై) దగ్గర తాన్సా అనే ఊళ్ళో భద్రతా విధుల పని పడింది. అక్కడికి వస్తూన్న వ్యక్తి సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రి. ప్రారంభోత్సవ వేడుక ఐపోయింది. నెహ్రూ వేదిక నుండి కిందకు దిగాడు. వెదురు కర్రలతో కట్టిన బారికేడులను దాటి వచ్చారు. ఆయనను కలవాలని ఉబలాట పడ్తూన్న ప్రజల వద్దకు జవహర్ లాల్ నెహ్రూ చేరారు.

జనాలను కంట్రోల్ చేయడం క్లిష్ట సమస్య ఐంది. సింగ్ తన లాఠీ (swagger stick)ని ఝళిపిస్తూ  జవహర్ లాల్ నెహ్రూ వెనుక బయల్దేరారు. గుంపులను అదుపు చేయడం దుస్సాధ్యంగా మారింది. నెహ్రూ చుట్టూ కమ్ముకున్న మనుషులను లాఠీని విసురుతూ, సింగ్ కాపలా కాస్తున్నాడు.

అకస్మాత్తుగా తన చేతిలోని లాఠీని ఎవరో లాగి విసిరేసారు. సింగ్ ఆగ్రహంతో చుట్టూ చూసాడు. తీరా చూస్తే అలా లాగి విసిరేసిన వారెవరో కాదు - జవహర్ లాల్ నెహ్రూ. లాఠీ కఱ్ఱను లాగి తీసుకుని, తన వైపు చూపిస్తూ అడుగుతున్నాడు-

“ఏమిటి నువ్వు చేస్తూన్న పని?”

నెహ్రూ కరకుగా అడిగాడు. అలా కర్కశంగా అరిచి, వెంటనే తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కి ఆర్డర్ జారీ చేసాడు-“ఈతనిని ఈ పని నుంచి పంపిచేసేయండి.”

కనురెప్పల కరకట్టలను దాటి వస్తూన్న కన్నీళ్ళను ఎలాగో ఆపుకుంటూ అక్కడి నుండి మహాన్ సింఘ్ బయస్ నిష్క్రమించారు.

******

కాస్సేపటి తర్వాత తర్వాత ప్రైమ్ మినిష్టర్ నుంచి సింగ్ కి ఆదేశం (సమ్మన్లు) వచ్చింది. “నా ఉద్యోగానికి ముప్పు వచ్చింది.” అనుకుంటూ గడగడ వణుకుతూ అక్కడికి చేరారు సింగ్.

మొరార్జీ దేశాయి, తతిమ్మా లీడర్లతో   కూర్చుని ఉన్నారు నెహ్రూ.    

“నువ్వేం చేద్దామనుకున్నావు??” సింగ్ ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఎలాగో పలికాడు – నత్తి నత్తిగా ఇలాగ “సర్! బ్లూ బుక్ ను నేను ఫాలో అయ్యాను.”

Blue Book  ప్రముఖ వ్యక్తులు (VVIP security measures) వచ్చినప్పుడు వాళ్ళకు భద్రత ఎలాగ కల్పించాలో తెలిపే బుక్. సెక్యూరిటీ ప్రమాణాలను వివరిస్తూన్న విధుల నియమావళి పట్టిక రాసి ఉంచిన పుస్తకము                                                  

సెక్యూరిటీ ఆఫీసర్, మొరార్జీ దేశాయి లు ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకి కొంచెం వివరంగా చెప్పారు.

నెహ్రూ కొంతసేపు మౌనంగా ఊరుకున్నారు. ఒక క్షణం ఊరుకున్న తర్వాత తల పంకిస్తూ అన్నారు “యంగ్ మాన్! వాస్తవం చెప్పాలంటే నువ్వే రైటు. నాదే పొరపాటు. అయాం సారీ!”

మహాన్ సింగ్ బయస్ ఆ సంఘటనను తలుచుకుంటూ చెబ్తూంటారు,

“కేవలం ఒక junior police officer వద్ద తన తప్పును ఒప్పుకునారు అంతటి ప్రధాన మంత్రి. అలాగ తన తప్పును తాను తెలుసుకుని, వెంటనే పశ్చాత్తాపంతో నెహ్రూజీ ఆడిగారు. అదే ఆయన గొప్పదనము.”

పండిట్ జీ అలాగ సారీ చెప్పగానే అప్పటిదాకా బిగబట్టున్న అశ్రువులు ధారాపాతంగా వెలువడినవి.

“ఈసారి నేను నా కళ్ళలో నీళ్ళను ఆపుకోవడానికి ప్రయత్నించ లేదు. అవి ఆనందబాష్పాలు కదా మరి!”

*******
జవహర్ లాల్ మరియు బ్లూ బుక్
User Rating:  / 1
Member Categories  - తెలుసా!
Written by kadambari piduri
Thursday, 01 May 2014 10:00
Hits: 197

అఖిలవనిత
పేజీ వీక్షణ చార్ట్ 26445 పేజీవీక్షణలు - 716 పోస్ట్‌లు, చివరగా Apr 24, 2014న ప్రచురించబడింది
Telugu Ratna Malika
పేజీ వీక్షణ చార్ట్ 3507 పేజీవీక్షణలు - 116 పోస్ట్‌లు, చివరగా Apr 17, 2014న ప్రచురించబడింది



No comments:

Post a Comment