Wednesday, February 16, 2011

నాడు, నేడు అమూల్య దశ





















చంద మామ కథలు,
అలనాటి కాశీ మజిలీలు,
జానపదాలూ
చిన్న తనపు ఊహల పర్ణశాలల ముంగిట్లో
వేసిన రంగ వల్లికలు.

వెన్నెల కాంచన కలశాలను ఉంచినాయి
అప్పటి కథలు
అలనాటి బాల కథలు
సుతి మెత్తని అలల సవ్వడులను
బాల్యనికి నాట్యాలు నేర్పించినవి.
శైశవము కూడా
మనిషి జీవితములో
విలువైన ప్రథమ దశ సుమా! - అనిపించిన మరుత్తులు అవి.

అందలి పద చమత్కారాలు, వాల్లభ్య శబ్దాలు -
పాటల పందిరిని నిశ్శబ్దంగా అల్లుకుంటూన్నట్టి
సౌగంధ భరిత, వర్ణ మయ సుమ రాశుల లతా సౌందర్యాలు.

ఇప్పుడు,
చెప్పేందుకు ఏమున్నది?
అంతా సుస్పష్టమే!

డిష్యుం డిష్యుం డిష్యుం.
ప్లాస్టిక్ కొమ్మల మీద
భీభత్స దృశ్యాల కులాయం(= గూడుల)లో
రేపటి గుడ్లు,

ఆ అండాల నుండి
వెలికి వస్తూన్న విహంగాల స్వభావాలు ఎలా ఉంటాయో
చూడ గలిగే గుండె నిబ్బరాన్ని
అలవరుచుకో, మిత్రమా!

( నాడు, నేడు , సుకుమారానికి ప్రాధాన్యం )

No comments:

Post a Comment