సూరజ్ సేన్ మహారాజుకు ఉన్నట్టుండి, మాట తడబడ సాగింది.
ఆయనకు “నత్తి” వచ్చింది.
తత్కారణంచే అమాత్య, సేనాధిపతి, ప్రజలతో
రాజ కార్య, ముఖ్య కార్యాలను గురించి చర్చించడానికి
ఈతని నత్తి- పెద్ద అవరోధంగా మారినది.
“ప్రభూ! మృగయావినోదము చేస్తే, మనోవ్యధ తగ్గుతుంది” అంటూ
రాణి, మంత్రులు సలహా ఇచ్చారు.
సూరజ్ సేన్ మహారాజు అడవిలో వేటకు వెళ్ళాడు.
అలాగా గుఱ్ఱముపై స్వారీ చేస్తూ, దారి తప్పియాడు.
గొంతు ఎండి పోయి, దాహంతో నాలుక పిడుచ కట్టుకుపోతూన్నది.
దారీ తెన్నూ తెలియందు, దికుతోచని స్థితి!
అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ముని తపస్సు చేసుకుంటూన్నాడు.
అతని పేరు “గ్వాలిపా”.
గ్వాలిపా మహర్షికి సూరజ్ సేన్ నమస్కారం పెట్టి,
“మహాత్మా! నా పేరు సూరజ్ సేన్.
ఇక్కడ కీకారణ్యంలో చిక్కుకున్నాను.
భరించలేనంత దప్పికగా ఉంది” అంటూన్న
ఆతనితో- మౌని ఇలాగ చెప్పాడు
“ఓ రాజా! అదిగో అక్కడ నీరు ఉన్నది.
ఆ కుండములోని జలము గొప్ప శక్తి కలది.
ఆ నీళ్ళను తాగితే, రుగ్మతలు, జబ్బులు తగ్గిపోతాయి”
వెంటనే సూరజ్ సేన్ ఆ నీటి మడుగు వద్దకు వెళ్ళి, నీటిని గ్రోలాడు.
ఆ రాజు అంతకు మున్ను కొన్ని ఏళ్ళ నుండీ,
దేహబాధతో అలమటిస్తూన్నాడు.
అక్కడి నీళ్ళు త్రాగగానే- ఆతడి బాధ, నత్తి కనికట్టులా మాయమైనవి.
ఇట్టి వింతను ఊహించని రాజు,
హర్షానందములతో ఆ ఋషికి మోకరిల్లాడు.
“స్వామీ! మీకు నేను ఏమి ప్రతిఫలమును ఇవ్వగలను?
మీరు ఏది కోరితే అది ఇస్తాను, చెప్పండి”
అందుకు బదులుగా మహర్షి ఏమి కోరాడో తెలుసా?
బదులుగా రాజ్యాలనూ, ధనాలనూ, ఆస్థిపాస్థులనూ కోరలేదు,
“రాజా! సన్యాసులకు వేరే కోరదగినవి ఏమి ఉంటాయి?
సరే! నీవు ఉగ్గడించిన విధంగా ఒక చిన్న మనవి, తీర్చగలవా?”
“అవశ్యం! సెలవీయుము స్వామీ!”
“ఈ మహత్తు గల జలములు
ప్రజలు అందరికీ అందుబాటులోనికి వచ్చే మార్గమును అనుసరించుము”
అందుకు “వల్లె!”అన్న రాజు తన మహలుకు వెళ్ళాడు.
అక్కడ తన భార్యకు జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించాడు.
పట్టమహిషి, పరిజనమూ
“మన మహా ప్రభువు సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఐనారు” అని
సంభ్రమాశ్చర్యాలతో చెప్పుకున్నారు.
మంత్రి, అమాత్యులు, అంతఃపుర స్త్రీలు అందరూ
ముని వాక్కు గూర్చి- ఆ విషయాలను చర్చించి, తుది నిర్ణయానికి వచ్చారు.
తాపసి వాక్కు ఆచరణలోనికి రావాలంటే-
అక్కడ ఆ అటవీ ప్రాంతాన్ని జనావాస యోగ్యంగా మార్చాలి- అనుకున్నారు.
కొన్నిరోజులలోనే వాస్తు పండితులు,శిల్పులు, భవన నిర్మాణము వారూ,
యావన్మందీ తలా ఓ చెయ్యీ వేసారు,
ఆ ప్రాంతము ఒక నగరముగా మారిపోయినది.
పేద ప్రజలు, నీరస పీడితులు. ఆ జలములతో పునః శక్తిమంతులు అవసాగారు.
అందరూ ‘గ్వాలిపా’ ముని పట్ల కృతజ్ఞతతో- “గ్వాలియర్” అని పిలవసాగారు.
అలాగే ఆ జలనిధి “సూరజ్ కుండ్” అనే నామముతో విరాజిల్లినది.
మధ్యప్రదేశ్ రాష్ట్రములోని గ్వాలియర్ -
తాన్ సేన్ మున్నగు చక్రవర్తుల కట్టిన దుర్గములు, తటాకములు,
ప్రకృతి దృశ్యములతో కనువిందు చేస్తూన్న చారిత్రక నగరము.
గ్వాలియర్ లో “సూరజ్ కుండ్” (Link:- Forkids, WEB)
Published On Thursday, October 13, 2011 By ADMIN.
Under: విజ్ఞానం, వ్యాసాలు.
రచన: కాదంబరి
[కాదంబరి - http://akhilavanitha.blogspot.com/ ]