Thursday, February 11, 2010

చిలక వంకర ముక్కు


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-

అనగనగా ఏడుగురు రాజ కుమారులు చేపలను పట్టడానికి బయలు దేరారు.........."
ఈ కథ ఆంధ్ర దేశములో దాదాపు అందరికీ సుపరిచితమైనదే!
రా కుమారులు ఎక్కడైనా సింహాలనూ, పులులనూ వేటాడ్డానికి వెళతారు గానీ,చేపల్ని పడతారా? "
అంటూ ఈ కాలపు సిసింద్రీలు అడుగుతారు .
దీంట్లోని అసంబద్ధత గురించిన తర్క మీమాంసలను కాస్సేపు అసంటా పెట్టేసి, రవంత యోచించండీ;
ఈలాంటి " గొలుసు (link) కథల వలన కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
అనేక పాత్రలను ఉంచడము, లింకు సంభాషణలు , అమితమైన ఆసక్తిని కలిగిస్తాయి.
పిల్లల జ్ఞాపక శక్తిని ఇనుమడింప జేస్తాయి ఇవి.
ఇదిగో! అలాంటి కథ ఈ దిగువన చదివి, ఆనందించండి.


( kRtaj~natalatO )

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో రామచిలక, చీమా మంచి స్నేహితులు.
ఒకసారి చిలక పుట్టిన రోజు వచ్చింది.
చిలక తన స్నేహితులందరినీ సాయంత్రం టీ పార్టీకి ఆహ్వానించింది.
తన ప్రాణ స్నేహితురాలయిన చీమని
"అందరి కంటే త్వరగా రావోయీ, చీమ మిత్రమా!" అంటూ, రమ్మని పిలిచింది.
చీమ అందరి కంటే త్వరగా చిలక ఇంటికి వెళ్ళింది.
చిలక గారెల పిండి రుబ్బుతూ ఉందప్పుడు.
చీమ వెళ్ళి " నేనేమి పని చేయాలో పురమాయించ"మంది.
చిలక " పొయ్యిమీద పాయసం పెట్టాను; కాస్త చూడమనేసరికి
చీమ గరిట పుచ్చుకుని పొయ్యి మీదకెక్కి గిన్నెలో పాయసం ఉండుకుతుంటే తొంగి చూసింది.
అలా చూస్తూ ఉన్నప్పుడు జారి అందులో పడిపోయింది. పాపం! ఆ వేడికి మరుగుతున్న పాయసంలో పడి చచ్చిపోయింది.
చాలా సేపయిన తరువాత చిలక వచ్చి చూసేసరికి పాయసంలో పడి చీమ ఉడుకుతూ కనపడేసరికి చిలక ఎంతో విచారించింది. తన ముక్కుతో అందులో పడ్డ చీమని బయటకు తీసింది.
ఆ వేడికి చిలక ముక్కు వంకర పోయింది.
బాధతో చిలక ఎగురుకుంటూ బయటకు వెళ్ళింది. చెట్టు మీద ఉన్న కాకి ఎగతాళి చేస్తూ "ఏమిటి చిలక బావా! నీ ముక్కు అలా వంకర పోయింది ." అని అడిగింది.
అప్పుడు చిలక" ఏం చెప్పమంటావు కాకి బావా! పాయసం లో చీమ పడ, చిలక ముక్కు వంక బాయ, కాకి కన్ను లొట్ట బాయ "' అనేసరికి కాకికి ఒక కన్ను పోయింది.
కాకి ఒంటి కన్నుతో తను రోజూ వెళ్ళే రావి చెట్టు దగ్గరికి వెళ్ళింది.
రావి చెట్టు "ఏంటి సంగతి ?" అంటే కాకి
"ఏమి చెప్పమంటావు; పాయసంలో చీమ పడ, చిలక ముక్కు వంక బాయ,కాకి కన్ను లొట్ట బాయ, రావి చెట్టాకులు రాలి పాయ " అంది.అంతే రావి చెట్టాకులన్నీ రాలి పోయాయి.
రోజూ రావిచెట్టుకింద కూర్చునే ఏనుగు ఆరోజు అక్కడికి వచ్చి ఆకులన్నీ రాలిపోయి ఉండటం చూసి చెట్టుని అడిగేసరికి రావిచెట్టు ఇలా చెప్పింది, ' "పాయసంలో చీమ పడ, చిలక ముక్కు వంక బాయ,కాకి కన్ను లొట్ట బాయ, రావి చెట్టాకులు రాలి పాయ ఏనుగు తొండం వెనక్కు పాయ " అనేసరికి ఏనుగు తొండం కాస్తా వెనక వీపుకి అతుక్కు పోయింది.
ఏనుగు నీళ్ళు తాగుదామని ఏరు దగ్గరకి వెళ్ళింది.
ఏరులోని నీళ్ళు ఏనుగు తొండం చూసి నవ్వితే ఏనుగు కధంతా చెప్పి....
"ఏటిలోని నీళ్ళు ఎండ బాయ " అంది.అంతే చుక్క నీళ్ళైయినా లేకుండా ఏరు ఎండిపోయింది.
రొజూ నీళ్ళ కోసం వచ్చే ఏడుగురు కోడళ్ళు ఆరోజు కూడా అటుగా వచ్చి ఎండిపోయిన ఏరుని చూసినివ్వెరపోయారు.
అప్పుడు ఏరు కధంతా చెప్పి, " ఏడు కోడళ్ళ తల మీద బిందెలు అతుక్కు పాయ " అంది.
అంతే !ఎంత ప్రయత్నం చేసినా ఆ బిందెలు రాలేదు.
కోడళ్ళు ఇల్లు చేరారు. వాళ్ళ అత్తగారు మావగారికి కంచంలో గరిటతో అన్నం వడ్డిస్తోంది. ఎంతసేపైనా బిందెలు కిందకి దించని కోడళ్ళని చూసి, అత్తగారు "ఏమిటే ఎంతసేపు మోస్తారు, ఇక బిందెలు దించండర్రా !" అంది.
కోడళ్ళు కధంతా చెప్పి,"అత్త చేతి గరిట అతుక్కు పాయ" అన్నారు;
అంతే! అత్త చేతి గరిట అలాగే ఉండిపోయింది.
కాసేపయ్యాక మావగారు వచ్చి పీట మీద కూర్చుని అన్నం తినడం మొదలెట్టాడు.
ఎంతసేపైనా భార్య గరిట వదలక పోవడం చూసి " సంగతేంట"ని అడిగేసరికి
అత్త కధంతా చెప్పి,"మావ కూర్చున్న పీట అతుక్కు పాయ!" అంది;
అంతే! కూర్చున్న పీట ఒంటికి అతుక్కు పోయింది.
కొట్టుకి అలాగే పీటతో సహా వెళ్ళిన సేటుని చూసి, కొట్టుకి వచ్చిన జనాలు అడిగే సరికి
సేటుగారు "పాయసంలో చీమ పడ, చిలక ముక్కు వంక బాయ,కాకి కన్ను లొట్ట బాయ, రావి చెట్టాకులు రాలి పాయ, ఏనుగు తొండం వెనక్కు పాయ,ఏటిలో నీళ్ళు ఎండ బాయ, ఏడు కోడళ్ళ బిందెలు అతుక్కు బాయ,అత్త చేతి గరిట అతుక్కు బాయ,మావ కింద పీట అతుక్కు పాయ, రోడ్డు మీద జనం అతుక్కుబాయ ' అన్నారు.
అంతే! ఎక్కడి వారు అక్కడే అతుక్కు పోయారు.
కాసేపటికి ఆ రోడ్డు మీదకి ఒక సాధువు వచ్చారు.
తన దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నారు.
ఇదంతా ఏదో శాపం వల్ల ఇలా జరిగిందని చెప్పి, తన మంత్రశక్తితో అంతా చక్కదిద్దారు.
కానీ ......
"దానిని తాకిన వంకర పోయిన చిలక ముక్కుని సరి చేయడం వీలు కాదని"
సెలవిచ్చి వెళ్ళిపోయారు.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


No comments:

Post a Comment