Monday, July 6, 2009

రంగులు - రమణీయమైన మోజులు




"ఇంద్రధనుస్సు" అనగానే సప్త వర్ణ సమ్మేళన సుమనోజ్ఞ వర్ణ వేదికా తోరణం చటుక్కున మన తలపులలో మెదులుతుంది. ఎరుపు, నీలం, ఆకు పచ్చ ప్రధానమైన రంగులు. వివిధ నిష్పత్తులలో ఈ మూడింటి మిశ్రమాలే అనేకనేక వర్ణాలను సృజిస్తున్నాయి.

మనస్సుకు రంగుల పట్ల గల ఆకర్షణయే, అనేక పండగలకూ, పబ్బాలకూ; రంగవల్లికలు, చిత్రలేఖనము ఇత్యాది అనేక కళలకు, దేవతారాధనల వేడుకలకు, తిరణాళ్ళకు ఎన్నింటికో పునాదులను వేసిందని చెప్పవచ్చును.

"ఆయా రంగులను ఇష్టపడేవారు ఎలాంటి స్వభావాలను కలిగి ఉంటారు?" అనే విషయం మీద అనేక ఆసక్తికరమైన ఫలితాలు వెలువడుతున్నాయి.


"ఎరుపు" రంగును ఇష్టపడే వారికి కోపం అధికంగా కలిగి ఉండే స్వభావాన్ని కలిగి ఉండే అవకాశం ఉన్నది. వారికి తమ పట్టుదల, పంతం నెగ్గి తీరాలనే ఆవేశం, మొండితనం ఉంటాయి. అలాటి వారు ఆడంబరాలకు ఎక్కువగా వెచ్చిస్తారు. ముఖ్యంగా రమణులకు ఈ రంగుల పట్ల మక్కువ ఎక్కువ. పిల్లలు ఎక్కువగా లేత రంగులను, పెద్దలు ముదురు రంగులను ఇష్టపడతారు.


"పసుపు" వన్నెను ఇష్టపడే వారికి జీవితంలో అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. వీరికి ఆవేశం తక్కువగా ఉంటుంది. ఐనప్పటికీ కృత నిశ్చయాన్ని, దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు. "ముదురు నీలం" వన్నెను ఇష్ట పడే వారు భద్రతకై ఆరాటపడతారు. "ఆకు పచ్చ, నీలం వర్ణాలు" ప్రియమైన వారికి జీవితం పట్ల ఎంతో భద్రతా భావం కలిగి ఉంటారు. వీరు బ్రతుకు పట్ల ఎంతో విశ్వాసము కలిగి ఉండి, స్థిమితంగా ఉంటారు కూడా. ఆభరణాల ఎంపికలలో కూడా రంగుల పట్ల గల మక్కువ, అభిరుచులు తెలుస్తూంటాయి. "నీలం రంగు" శాంతిని ప్రసాదిస్తుంది.
*** *** *** *** *** *** ***

పురాణ, ఇతిహాస గాధావళిని అనుసరించి, వానిలోని వర్ణ విశ్లేషణలను గమనించండి, ఎంతో ఆశ్చర్యం కలుగక మానదు. త్రిమూర్తులు, వారి భార్యల ఆహార్యము, నివాసముల ఎంపిక విభిన్న తరహాలలో గోచరిస్తాయి.

"వీణా పాణి", "పుస్తక ధారిణి" ఐన శ్రీ సరస్వతీదేవి కువలయ నివాసిని, ఆమె తెల్లని కలువ పూవులో ఆశీనురాలై, సారస్వత జగత్తును అనుగ్రహిస్తున్నది.

శ్రీ లక్ష్మీ దేవి పద్మాలయ, తామర పూవు ఆమె నివాసము. శ్రీ విష్ణుమూర్తి పీతాంబరధారి, పన్నగ శయనుడు, వైకుంఠ నివాసి. పాపం! భోళా శంకరుడు, విభూది ప్రియుడు. ఐతే, దేవి సకల ఆభరణాలంకృత.
*** *** *** *** *** *** ***

స్త్రీలు సహజంగా అనేక రంగులని ఇష్టపడతారు. అందుకనే పేరంటాలకు, పెళ్ళిళ్ళకు, పండగలకూ పబ్బాలకూ వన్నె వన్నెల పట్టు చీరలు రెప రెపలాడుతూ నిండుదనాన్ని చేకూరుస్తాయి. కనుదోయికి ఆహ్లాదాన్ని కలిగించే "బొమ్మల కొలువు" వంటి వేడుకలు, మహిళామణుల నిర్వహణలో శోభాయ మానంగా సందర్శకులను అలరిస్తూ ఉంటాయి. ఈ వర్ణ సమ్మేళనాల ప్రభావం మీద పరిశోధనలు సరి కొత్త మలుపు తిరిగాయి. వైద్య రంగంలో ప్రయోగాలు ఈ దిశగా సాగుతున్నాయి. "బాబిట్" మొదలగు వారు ప్రకృతి వైద్యంలో ఈ విషయ పరిజ్ఞాన్ని ఉపయుక్త పరుస్తున్నాయి.
*** *** *** *** *** *** ***

బట్ట తల నివారణకై నీలి వర్ణోదకమును వాడి, అద్భుత ఫలితాలను పరిశోధకులు వెల్లడించారు. నీలం రంగు సీసాల్లో నీళ్ళు పోసి, సూర్యరశ్మిలో ఉంచాలి. అలాంటి నీలి వర్ణోదకమును రెడీ చేసుకోవాలి. బట్ట తలకు ఆలివ్ ఆయిలును పట్టించి ఆ తరువాత నీలి వర్ణోదకమును వెంట్రుకల కుదుళ్ళకు మర్దన చేస్తూ, వాడిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ప్రకటించారు.

ఇలాంటీ సిద్ధాంతాలను ఆధారము చేసుకుని ఇప్పుడు ఇంటి గోడలకు, గదులకు వైవిధ్యభరితముగా వివిధ వర్ణముల సున్నాలను, డిస్టెంపరులనూ వాడుతున్నారు.

నవ వధువు చేతిలో గోరింటాకుకు, పెదవులలో తాంబూల రాగము, పాదములకు పారాణి సుందర మధు హాసాలను చిందిస్తాయి. పెళ్ళిళ్ళలో రంగు రంగుల పూలను అలంకరిస్తారు. ఈనాడు గోరింటాకు, ఒక అద్భుతమైన కళగా "మెహిందీ ఆర్టు"గా కొత్త పుంతలు తొక్కుతూ, అభివృద్ధి గాంచుతున్నది.ఇలాగ అడుగడుగునా నిత్య జీవితంలో రంగుల సొగసులు ప్రధాన నేస్తాలుగా మారి, మానవుని మనస్తత్వానికి అద్దం పడుతూ, అందరినీ పలకరిస్తూ, మానసికోల్లాసాన్ని కలుగజేస్తున్నాయి .

********************************************

(ఈ వ్యాసము http://andhrafolks.net లో ప్రచురణ )

No comments:

Post a Comment