
బాగుగ చల్లలు యశోద చిలుకగ
వేగు చుక్కకు మెలకువ రాగా
క్షీరాబ్ధిశయనుడు బిర బిర వచ్చెను
విరాజిల్లెను నిఖిల లోకమ్ములు ||
ఉగ్గు గిన్నెతో వచ్చేసి
క్రిష్ణుడు , అమ్మ చెంగును గుంజాడు
“గుక్కెడు వెన్న, చిక్కటి మీగడ
గ్రక్కున ఇవ్వు, అంతే! చాలనె " ||
కొడుకు ముంగురులు సవరిస్తూ
“దుడుకు తనములను మానా”లంటూ -
పొంగు నురుగుల గుమ్మ పాలను
తల్లి ఇవ్వగా - చిన్ని క్రిష్ణుడు
చెంగున గెంతి, గడ గడ త్రాగెను
కెంపు పెదవులన్ తరిపి నురుగులు,
ఇంపుగ ప్రభాత కిరణాళి
వంపుల హరి విల్లులు విరిసెను
సొంపౌ కౌస్తుభ మణులై మెరిసెను ||
తంబుర తీగల రాగము లెలమిని
నారద మౌనికి లభియించంగా
మహతీ తంత్రులు సవరించేను
మా మానసములు కుందన పుటలయె ||
No comments:
Post a Comment