విష్ణువర్ధనుని భార్య అఖిలాండేశ్వరీ దేవి.
వారి కుమార్తె హరిత, కుమారుడు గ్రీష్మ దేవ్.
విదేహ రాజ్యానికి నదీశ్వర్ ఏలిక.
“మా పుత్రిక స్వయం వరము జరుగుతుంది.
కాబట్టి మీరెల్లరూ ఈ సంరంభములో పాల్గొనవలసినదిగా కోరుచున్నాము“
విష్ణువర్ధనుని కుటుంబీకులు -
వారి బంధువుల పాలనలో ఉన్న విదేహ రాజ్యానికి వెళ్ళారు.
నదీశ్వరుని కుమార్తె అంతకు మునుపే,
రోహణుని ప్రేమించింది,
కాబట్టి ఆమె అక్కడ స్వయంవరములో
రోహణుని మెడలో వరమాల వేసినది,
వారిరువురికీ పరిణయం కుదిరింది.
**************************************
అందరూ తమ తమ రాజ్యాలకు మరలి వెళ్ళసాగారు.
అఖిలాండేశ్వరి, తనయ, తనూజుడు కూడా గుఱ్ఱపు బగ్గీలో ఎక్కించి,
నదీశ్వర్ దంపతులు సాదరంగా అతిథులుగా వచ్చిన వారికీ,
అక్కడ స్వయంవరములో పాల్గొన్న వారికి, అందరికీ వీడ్కోలు పలికారు.
గ్రీష్మ దేవ్ తన రాజ్యానికి మరలిపోయాడు.
స్వదేశానికి వచ్చిన గ్రీష్మ దేవ్
అశాంతితో విర విరలాడసాగాడు.
“విదేహ రాజపుత్రిక తనను వరించలేద”ని
అవమానంతో కుతకుతలాడసాగాడు………………..
.
గుర్రబ్బగ్గీలలోనికి ఎక్కేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది.
హరిత జడపాయలలోనికి మూడు సీతాకోకచిలుకలు వాలినాయి.
రాకుమార్తె బండిలోకి ఎక్కిన తర్వాత,
సారధి, తలుపులను మూసి,
ఛెర్నాకోలతో అశ్వములను అదిలిస్తూ ముందుకు సాగాడు.
తమ రాజ్యాన్ని చేరిన పిమ్మట
“చిన్నమ్మా! మీ సిగలో ఏవో కొత్త రకం పూలు ఉన్నాయి”
వాటిని వింతగా చూస్తూ, అడిగారు ఆమె చెలికత్తెలు.
తీరా చూస్తే అవి కీటకాలు!!!!!!
‘అవి ఏమిటో?’ వారెవ్వరికీ అర్ధం కాలేదు.
ఎందుకంటే ఆ దేశములో భ్రమరాలు, సీతాకోకలూ
అసలు లేనే లేవు.
వారినీ వీరినీ “వాటిని ఏమని పిలుస్తారు?” అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు.
అచ్చోటికి ఒక తాపసి వచ్చాడు.
దేశ సంచారి ఐన “నయన స్వామి”ని
రాజకుమారి,తదితరులు
“ఇవి ఏమిటి స్వామీ!” అని అడిగారు.
వాటిని గమనించి, ముని
“అవి భ్రమరములు. వానిని సీతాకోక చిలుకలు- అని పిలుస్తారు”
అంటూ వారి సందేహ నివృత్తి చేసాడు.
అప్పటినుండీ యువరాణి హరిత
ఆ సీతాకోక (butterflies) ని జాగ్రత్తగా చూసుకోసాగింది.
ఐనప్పటికీ అవి, చిక్కిపోతున్నాయి.
శుష్కించిపోతూన్న ఆ బటర్ ఫ్లై లను చూసి,
హరిత దిగులుపడసాగింది.
ఆమెతో ఆ రంగుల సీతాకోకలు చెప్పాయి ఇలాగ,
“ఓ రాజకుమారీ! మీ రాజ్యంలో చెట్లు, తోటలు, మొక్కలూ లేవు.
మేము పచ్చని మొక్కలు, తరువులు,
పూల తోటి మేము సావాసం చేస్తూంటాము.
పుష్పాలూ, పూల పుప్పొడులే మా అతిథి గృహాలు.
ఇచ్చట పచ్చదనము కరువైనట్లుగా ఉన్నది గదా!
మాకు బాగా ఉక్క పోస్తూన్నది. ఉష్ణముగా కుడా ఉన్నది,
ఇలాగ ఎందుకని ఔతూన్నది?”
అప్పటికి వారికి బోధపడింది
‘విష్ణువర్ధన చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని దిగంతాల మేరకు
విస్తరించాలని ఆకాంక్షించాడు.
ఇతర రాజ్యాల పైకి దండెత్తి, అశ్వమేధ యాగము చేసి, జైత్ర యాత్రలతో
కొంతవఱకూ తన కోరికను సాధించాడు కూడా!
తన లక్ష్య సాధనకై, ఆతడు ఇంకా ఇంకా సైనిక బలాగాలను,
ఆయుధాలనూ ఇబ్బడిముబ్బడిగా పెంపొందించసాగాడు,
ఇలాగ తయారుచేసే కర్మాగారాలతో రాజ్యం అంతా నిండింది.
ఆయుధ సంపదను వృద్ధి చేసే యావలో,
తన సీమలో సేద్య, విద్యా, విజ్ఞాన సంపత్తిని నిర్లక్ష్యం చేసాడు.
ఫలితంగా దేశంలో నిరక్షరాస్యత, అజ్ఞానమూ తాండవించసాగాయి.
వ్యవసాయం కుంటువడి, కరువు కాటకాలు మీద విరుచుకుపడడంతో
దొంగతనాలు, కుత్సితత్వాలు పెచ్చుమీరినాయి.
ప్రజలు నిత్యావసరాలైన కూడు, గుడ్డ, నీరు కోసంకూడా కొట్లాడుకోసాగారు.
దేశమంతటా చెలరేగినట్టి అంతర్గత కుమ్ములాటలు -
శాంతి సౌభాగ్యాలకు చేటు తెచ్చాయి ‘
సీతాకోక చిలుకలు తమ సీమలో లేని కొత్త కీటకములు.
వాటి అందచందాలకు అందరూ ముగ్ధులైనారు.
అందుచేత రాజకుమారి హరితయే గాక,
యావన్మందీ, ఆ సీతాకోక చిలుకల కోసము
ఉద్యానవనములను పెంచసాగారు.
తద్వారా తేనెటీగలు వృద్ధి చెందాయి.
దానివలన తేనె వ్యాపారముద్వారా ప్రజలకు జీవనోపాధి కలిగించింది.
అలాగే – ఎప్పుడైతే, చెట్లు, లతలు కళకళలాడసాగాయో-
అప్పటినుంచీ- వాతావరణం ప్రఫుల్లమైనది.
గాలిలో చల్లదనం చోటు చేసుకొన్నది.
అప్పటిదాకా తగ్గు ముఖం పట్టిన వర్షాలు బాగా కురవసాగాయి.
వానలు కురవడంతో
రైతులకు ఉత్సాహం, ఉల్లాసం కలిగాయి.
కర్షకలోకంలో కొత్త హుషారు, ఆనందాలు వెల్లివిరియసాగాయి.
రాజకుమారుడు గ్రీష్మ దేవ్ లో కూడా నెమ్మ నెమ్మదిగా మార్పు వచ్చింది.
నిన్నటిదాకా “యుద్ధము, దండయాత్రలు చేయడము” అనే
ఆలోచనలు తప వేరేమీ ఎరుగని అతను,
క్రమంగా శాంతి నెలకొంటూన్న జన సంఘములనూ,
శాంతి విప్పారుతున్న దేశమునూ తిలకించగలిగాడు.
“నేటి దాకా మనము సైనికావసరములకు మాత్రమే
కోశాగార ధనమును పూర్తిగా వినియోగిస్తున్నాము.
కానీ ఇకనుండీ, అధిక ధన సంపదలను
ప్రజా శ్రేయస్సుకై వెచ్చిద్దాము”!!! “అని
తన దృఢ సంకల్పాన్ని ఎలుగెత్తి చెప్పాడు.
ఆ పలుకులను వినగానే
సామ్రాట్టు చెల్లెలు, రాజు, రాణి, బంధువులే కాక,
సకల ప్రజానీకమూ హర్షధ్వానాలు చేసింది.
“జేజేలు! జేజేలు” అన్నాయి
వివిధ వర్ణాలతో శోభిల్లుతూన్న సీతాకోక చిలుకలు.
(రచన; కాదంబరి)
***************************************
వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము (forkids)
Published On Friday, February 10, 2012 By ADMIN.
Under: కథలు, పురాణ కథలు.
రచన : కాదంబరి పిడూరి ;
;